సినిమా జీవితాన్ని మార్చింది. జీవితం రాజ‌కీయ రంగాన్ని శాసించింది. రంగుల క‌ల నెర‌వేరింది.జీవన సాఫ‌ల్య‌త ద‌క్కింది.క‌ల నుంచి వాస్త‌వం.తెరంగేట్రం నుంచి జ‌నంగేట్రం. సినిమాకైతే రికార్డులు.. క‌లెక్ష‌న్లు..క‌టౌట్లు.. రాజ‌కీయానికైతే.. డిపాజిట్లు..డిఫాల్ట‌ర్లు.. ఓటు బ్యాంకులు.. వ‌గైరా..వ‌గైరా.. పెద్దాయ‌న‌కు అన్నీ తెలుసు. సాహిత్యం తెలుసు. సినిమా తెలుసు. పౌరాణికం తెలుసు.జాన‌ప‌ద‌మూ తెల్సు.కథకు నాయ‌క‌త్వం వ‌హించినోడికి జ‌న‌తకు నాయ‌క‌త్వం వ‌హించ‌డం చేత‌కాద‌ని.. చేయ‌లేడ‌ని ఎలా అనుకుంటాం.వ‌చ్చాడు..దూసుకొచ్చాడు.. తీసుకొచ్చాడు. తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచాడు. చెప్పిందే చేశాడు. చేసేదేదో చెప్పాడు.విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నాడు. నిర్ణ‌యాక శ‌క్తిగా ఎదిగాడు. జై ఎన్టీఆర్‌.

మ‌న‌దేశం .. నా దేశం.. ఒక‌టి 1949లో విడుద‌లైంది.మ‌రొక‌టి 1982లో విడుద‌లైంది.అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎంతో తేడా.అన్న‌గారు ఇంతై.. ఇంతితై.. న‌టుడింతై ఎదిగారు.తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమ‌డింజేశారు.సినీన‌టుడిగా అగ్ర‌ప‌థాన దూసుకుపోయి తానేంటో నిరూపించుకున్నారు. పౌరాణిక‌, సాంఘిక‌, జాన‌ప‌ద క‌థా చిత్రాల‌లో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు. ఓ అన్నా! స‌రిలేరు నీకెవ‌రు అన్నా! కానీ దేశం దేశంలా లేదు. రాజ్యం రాజ్యంలా లేదు. రాష్ట్రం.. రాష్ట్రంలా లేదు. అంత‌టా అశాంతి.. అల‌జ‌డి.. పూట‌కో ప‌ద్యం.. గ‌డియ‌కో గ‌ద్యం వినిపించే కాంగ్రెసోళ్లు అర‌చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.ఎప్పటిక‌ప్పుడు ముఖ్య‌మంత్రుల‌ను మారుస్తూ తామేంటో .. త‌మ త‌ప్పుడు విధాన‌మేంటో చెప్ప‌క‌నే చెబుతున్నారు.ఆనాటి ముఖ్య‌మంత్రి టంగుటూరి అంజ‌య్య‌ను అవ‌మానించాడు రాజీవ్.. ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో.. ఇక్క‌డే.. మ‌న బేగంపేట విమానాశ్ర‌యంలోనే.. పెద్దాయ‌న క‌దా! భ‌రించాడు. స‌హించాడు.త‌రువాత కాంగ్రెస్ నాయ‌కులు ఒక్కొక్క‌రూ తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వీధుల్లో తాక‌ట్టుపెట్టారు. న‌ర‌జాతి స‌మ‌స్తం ప‌రపీడ‌న ప‌రాయ‌ణ‌త్వం అనేందుకు ఇంత‌క‌న్నా మ‌రో తార్కాణం ఉండ‌ద‌న్న రీతిన ప్ర‌వ‌ర్తించారు.హ‌స్తిన పురిలో తెలుగువారి ప‌రువు తీశారు. ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా.. నీతి, నియ‌మం మ‌రిచారు. అన్న ఎన్టీఆర్ ను ఇవ‌న్నీ క‌దిలించాయ్‌. ఆలోచింప‌జేశాయ్‌. స‌గ‌టు తెలుగు వాడిలో చైత‌న్యం ప్రోదిజేయించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ్డాయ్‌.

“క‌ర్త‌వ్యం నీ వంతు..
కాపాడుట నా వంతు.. ”
అన్న‌ నంద‌గోపాలుడి బోధ‌నను అక్ష‌రాల అమ‌లు చేసేలా చేశాయ్‌.
ఆవిర్భావ‌మే ఓ సంచ‌ల‌నం. అన్న ప్ర‌స్థానం సుమ‌ధుర ఘ‌ట్టం.మ‌ధురాతి మ‌ధురం.
ఆ.. రామ‌చ‌రితం అనితరం.. అద్వితీయం.
అందుకే ఆయ‌న తెలుగు నాట దేవ‌దేవుడిగా కొలువై ఉన్నాడు
జ‌న‌నీరాజ‌నాలు అందుకున్నాడు ఏ లోకాన ఉన్నా వ‌ర్థిల్ల‌వ‌య్యా!
రామ‌య్య మాట త‌ల‌చి.. చంద్ర‌య్య బాట న‌డిచి చెయ్యెత్తి జై కొట్ట‌వ‌య్యా ఓ తెలుగోడా!

అది 1983. నాటి ఎన్నిక‌ల్లో అన్న ఎన్టీఆర్ బీసీల‌కు ప‌ట్టం క‌ట్టారు. ప‌సుపు జెండా విజ‌య‌గ‌ర్వంతో రెప‌రెప‌లాడింది. పేద‌వాడికి ప‌ట్టెడ‌న్నం దొరికే రోజులొచ్చేశాయ్‌. సైకిల్ అప్ర‌తిహ‌త యాత్ర‌కు ఇక! ఆటంకాలంటూ ఏమీ లేవ్‌ . అంద‌రికీ అన్నంపెట్టే అన్న‌దాతకు ఇక్క‌డ అగ్ర‌తాంబూలం. వెనుక‌బ‌డిన కులాల సంక్షేమ‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. రాజ్యాధికారం కాదు రామ‌రాజ్య సాధ‌నే ధ్యేయం. ఔను! అన్నీ మంచి శ‌కున‌ములే.. అన్నీ..అన్నీ.. క‌ద‌న‌రంగంలో క‌లిసొచ్చే వీచిక‌లే! సూచిక‌లే!

నేటి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల‌, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు, మండ‌లిలో చీఫ్ విప్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, రాజ‌మండ్రికి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, క‌ళా వెంక‌ట్రావు (ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు), పెన్మ‌త్స సాంబ‌శివ‌రాజు, దివంగ‌త నేతలు ఎర్రన్నాయుడు ,పరిటాల రవి, జీ ఎంసీ బాలయోగి,లాల్ జాన్ బాషా,ఎలిమినేటి  మాధవరెడ్డి, అలానే ప్రస్తుత సభాపతి కోడెల శివ‌ప్ర‌సాదరావు, మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు, డా.ఎంవివిఎస్ మూర్తి,  ప్ర‌తిభా భార‌తి వీరంద‌రితో పాటు ఆఖ‌రికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నాడు అన్న అడుగుజాడ‌ల్లో న‌డిచిన‌వారే!నాడు వీరంతా యువ‌కులు.ఉడుకు ర‌క్తం ఉర‌క‌లెత్తే వ‌యస్సుల్లో రాజ‌కీయ అరంగేట్రం చేసి, పాల‌న‌ను ప‌రుగులెత్తించిన వారు. తెలుగుదేశంలో పాఠ‌శాల‌లో ఓన‌మాలు దిద్దుకుని, క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌లుగా ఎదిగిన వారు. అన్న స్ఫూర్తితో త‌మ‌ని తాము తీర్చిదిద్దుకున్న‌వారు. వీరిలో కొంద‌రు అతి సామాన్య కుటుంబాలు నుంచి వ‌చ్చి అన‌న్య సామాన్య రీతిలో రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అదంతా అన్న గారి ద‌క్ష‌త‌కు తార్కాణం. అన్న గారి ప‌ఠిమకు / గ‌రిమకు అదే.. అదే.. సంకేతం. అందుకే ఐ స‌పోర్ట్ టీడీపీ.

ప్రాంతీయ పార్టీలు దేశానికి కొత్తేమీ కాదు. తెలుగు దేశానికి ముందు త‌రువాత కూడా అనేకానేక పార్టీలు ప్ర‌స్థానాన్ని ప్రారంభించాయి కానీ అవేవీ ఏమంత‌గా రాణించ‌లేక‌పోయాయి. 1921లో పంజాబ్‌లో శిరోమ‌ణి అకాలీద‌ళ్, 1927లో జ‌మ్మూ-క‌శ్మీర్‌లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీలు రూపుదిద్దుకున్నా అవేవీ తెలుగుదేశం అంత‌టి ప్రాభవాన్నీ, వైభ‌వాన్నీ ద‌క్కించుకోలేక‌పోయాయ్‌. కొన్ని ప్రాంతీయ పార్టీలైతే మ‌ఖ‌లో పుట్టి పుబ్బ‌లోనే క‌లిసిపోయాయ్‌. అవి అధికారం చేప‌ట్టేందుకు ద‌శాబ్దాల కాలం పాటు వేచిచూడాల్సి వ‌చ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ రావ‌డం రావ‌డంతోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించుకుంది.పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారం ద‌క్కించుకుంది. సంచ‌ల‌నం సృష్టించింది.చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది. 33 ఏళ్ల ప్ర‌స్థానంలో స‌గానికి పైగా కాలం అధికారంలోనే ఉంది.పేద‌ల‌కు చేరువుగా.. అన్నివ‌ర్గాల‌కూ సంక్షేమ ఫ‌లాలు అందించాల‌న్నదే లక్ష్యంగా..ముందడుగు వేస్తోంది. సంక్షేమం – అభివృద్ధి ఈ రెంటికీ స‌మ ప్రాధాన్యం ఇస్తూ మున్ముందుకు దూసుకుపోతోంది.

1983 నాటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సంజ‌య్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తుపెట్టుకుని 214 సీట్లు కైవసం చేసుకుని, 54.04 ఓట్ల శాతంతో విజ‌య దుందుభి మోగించింది.(సంజ‌య్ విచార్ మంచ్ పార్టీకి అధ్య‌క్షురాలు : మేనకా గాంధీ, ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రిగా ఉన్నారు) అధికారం చేప‌ట్ట‌గానే అన్న గారు అవినీతి అంత‌మొందించేందుకు 1983, నవంబ‌ర్ ఒక‌టిన లోకాయుక్త చ‌ట్టానికి శ్రీ‌కారం దిద్దారు. త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు రామ‌చంద్రరావు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన సంద‌ర్భంగా ఆయ‌న ఇంటిపై ఏసీబీ దాడులు చేయించారు.బిడ్డ‌లు ఎవ‌రికైనా బిడ్డ‌లు అన్న భావ‌న‌తో ఆడ‌బిడ్డ‌ల‌కు ఆస్తిహ‌క్కు క‌ల్పించారు.దేవుడికి ఇచ్చిన భూముల‌కు ప‌న్నేంట‌ని ప్ర‌శ్నిస్తూ భూమి శిస్తును ర‌ద్దుచేశారు. ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు ఎంసెట్ (ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిస‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌)ను ఏర్పాటుచేశారు.చిన్నారుల‌కు మెరుగైన విద్య అందించాల‌న్న ల‌క్ష్యంతో గురుకులాల‌ను ప్రారంభించారు.స్వ‌గ్రామ‌మైన కృష్ణాజిల్లా, నిమ్మ‌కూరులో మొద‌టి గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ను నెల‌కొల్పి ప‌దుగురికీ ఆద‌ర్శంగా నిలిచారు.శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌కు, మావోయిస్టుల‌పై పోరాటానికి ప్ర‌త్యేక క‌మాండో వ్య‌వ‌స్థ‌ను నియ‌మించారు.
హైద్రాబాద్‌లో మ‌త క‌ల‌హాల‌ను ఉక్కుపాదంతో అణిచివేశారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ప్ర‌తి పేద‌వాడికి ప‌ట్టెడ‌న్నం దొర‌కాల‌న్న స‌దుద్దేశంతో రెండు రూపాయ‌లకే కిలోబియ్యం అందించారు. ప‌క్కా ఇళ్ల నిర్మాణానికి సంక‌ల్పించి, విద్యుత్ సౌక‌ర్యం అందించారు. ఇందుకు ఇంటికో బ‌ల్బు ప‌థ‌కానికి శ్రీ‌కారం దిద్దారు. ట్యాంక్ బండ్‌పై తెలుగు తేజాల విగ్ర‌హాలు నెల‌కొల్పి న‌భూతో ..అనిపించుకున్నారు. హుస్సేన్ సాగ‌ర్ మ‌ధ్య‌లో త‌థాగ‌తుని విగ్ర‌హం నెల‌కొల్పి, సంబంధిత తీరాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు.ఆసియాలోనే అతి పెద్ద బ‌స్టాండ్ అయిన మ‌హాత్మా గాంధీ బ‌స్టాండ్‌కు పునాది రాయి వేశారు.తెలంగాణ – ఆంధ్రాలో పెత్తందారి వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తిరూప‌మైన ప‌టేల్, క‌ర‌ణం – మున‌స‌బు వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి విప్ల‌వాత్మ‌క శ‌కానికి నాంది ప‌లికారు.

విజ‌య‌వాడ‌లో త‌న పేరిట హెల్త్ యూనివ‌ర్శిటీని, హైద్రాబాద్‌లో తెలుగు విశ్వ‌విద్యాల‌యాన్ని, తిరుప‌తిలో ప‌ద్మావ‌తీ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యా న్ని ప్రారంభించి, విద్య ప‌ట్ల త‌న ఆస‌క్తిని చాటుకున్నారు ఎన్టీఆర్‌.క‌లియుగ వైకుంఠంగా పేరొందిన తిరుప‌తి అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకున్నారు. తెలుగు గంగ ప‌థ‌కం ద్వారా రాయ‌ల‌సీమ‌కు సాగు, చెన్న‌య్‌కు తాగు నీరు అందించి త‌న నిబ‌ద్ధ‌త చాటుకున్నారు.ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌నను ప్ర‌వేశ‌పెట్టారు.రైతుల‌కు త‌క్కువ ధ‌ర‌కే విద్యుత్ అందించారు. స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి, ఆయా వ‌ర్గాల‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. 1991లో అనూహ్య ప‌రిస్థితుల్లో లోక్‌స‌భ‌కు వ‌చ్చిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి పోటీచేసిన నాటి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుపై పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌కుండా పార్టీ ఏదైనా స‌రే! తెలుగువారిని గౌర‌వించాల‌న్న విధానానికి క‌ట్టుబ‌డ్డారు. పార్టీల‌క‌తీతంగా.. అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు.

అన్న వారసుడిగా పార్టీ, ప్ర‌భుత్వ ప‌గ్గాలు అందుకున్న నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న బాట‌లోనే న‌డిచి అనేకానేక అద్భుతాలు సృష్టిం చారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మలిచారు.తెలుగు వారి కీర్తిప‌తాక‌ను వినువీధుల్లో ఎగుర‌వేశారు.ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి అభి వృద్ధి కి పాటుప‌డ్డారు. రానున్న కాలంలో ఐటీ రంగంలో అపార అవ‌కాశాలుంటాయ‌ని ఆనాడే గుర్తించి ఆ రంగాన్ని ప్రోత్స‌హించారు.హైటెక్ సిటీని నిర్మిం చి, త‌ద‌నంత‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌నూ అభివృద్ధి చేసి హైద్రాబాద్‌ను కాస్త సైబ‌రాబాద్‌గా మార్చారు.హైటెక్ పాల‌న‌ను అందించారు.ఆధునిక టెక్నాల‌జీని అందిపుచ్చుకుని పాల‌న‌ను వేగ‌వంతం చేశారు.మ‌హిళ‌లు స్వ‌యంస‌మృద్ది సాధించాల‌న్న ధ్యేయంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు.పండిన పంట‌కు గిట్టుబాటు దొర‌క్క అవ‌స్థ‌లుప‌డుతున్న త‌రుణంలో ద‌ళారీల మోసాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు రైతు బ‌జార్లు ప్రారంభించా రు.నేష‌నల్ ఫ్రంట్ ఛైర్మ‌న్ గా మామ ఎన్టీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌గా, అల్లుడు చంద్ర‌బాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మ‌న్‌గా 90వ ద‌శ‌కం ద్వితీయార్థంలో కేంద్ర రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు.ప్ర‌ధాన మంత్రుల‌ను ఎంపిక‌చేసే స్థాయికి ఎదిగారు. దేవెగౌడ‌, ఐకే గుజ్రాల్ ఎంపిక ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌డం గ‌మనార్హం.అనంత‌ర కాలంలో ఎన్డీఏ క‌న్వీన‌ర్ గా ఐదేళ్ల పాటూ త‌న‌దైన శైలిలో.. దూసుకుపోయారు.ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉన్నా దానిని వ‌దులుకుని, రాష్ట్రాభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు సాగారు.ఎన్టీఆర్ హ‌యాంలో క‌ర్ష‌క ప‌రిష‌త్ చైర్మ‌న్ గా, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేశారు.1984 ఆగ‌స్టు సంక్షోభ స‌మ‌యంలో పార్టీ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచి మ‌ళ్లీ ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు త‌న వంతు పాత్ర స‌మ‌ర్థంగా పోషించి, అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు.

1994లో ఎన్టీఆర్ మంత్రివ‌ర్గంలో కీల‌క‌మైన ఆర్థిక‌, రెవెన్యూ శాఖల మంత్రిగా ప‌నిచేశారు.చిత్తూరు జిల్లాలోని మారుమూల నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పం నుంచి భారీ మెజార్టీతో గ‌త కొన్నేళ్లుగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు.ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌రువాత 1996, 98, 99 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌ప‌థంలో..న‌డిపించారు.1999లో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి రికార్డు సృష్టించారు. త‌న తొమ్మిదేళ్ల పాల‌న‌లో అనేకానేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు.యంత్రాగాన్ని ప‌రుగులు పెట్టించారు. ఉద్యోగుల్లో ప‌ని సంస్కృతిని, పాల‌న‌లో జ‌వాబుదారీత‌నాన్ని పెంచారు. 99 నుంచి 2004 వ‌ర‌కూ ఎన్డీఏ స‌ర్కారుకు బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇచ్చి రాష్ట్రానికి అనేక ప‌థ‌కాల ద్వారా నిధులు రాబ‌ట్టి, అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు.అధికారంలో ఉన్న‌ప్పుడూ..లేన‌ప్పుడూ ప్రజాప‌క్ష‌మే నిలిచి అలుపెరుగ‌ని శ్రామికుడ‌య్యారు.2013లో వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి, చ‌లించిపోయారు.విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడే నిబంధ‌న‌లకు విరుద్ధంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మిస్తోన్న బాబ్లీ ప్రాజెక్టు పై అలుపెరుగ‌క పోరాడారు.

2014, జూన్ 8 న ముఖ్య‌మంత్రిగా మ‌ళ్లీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక రాష్ట్రాభివృద్ధికి పున‌రంకితం అయ్యారు. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తున్నారు. న‌వ్యాంధ్ర‌కు పెట్టుబ‌డుల సాధ‌నే ధ్యేయంగా దేశ‌,విదేశాల‌నూ చుట్టివ‌స్తున్నారు.భూ సేక‌ర‌ణ కాద‌ని స‌మీక‌ర‌ణ‌కు ప్రాధాన్య‌మిచ్చి ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌నీయ‌క అమ‌రావ‌తి న‌గ‌రి నిర్మాణానికి 33వేల ఎక‌రాలను సేక‌రించి, త‌న విధానాల‌కు ఎదురేలేద‌ని నిరూపించుకున్నారు. రుణ మాఫీని అమ‌లుచేసి, డ్వాక్రా రుణాలు ర‌ద్దు చేసి, అనుకున్న వ్య‌వ‌ధిలోనే ప‌ట్టిసీమ, తోట‌ప‌ల్లి ప్రాజెక్టుల‌ను పూర్తిచేసి జ‌న నిరాజనాలు అందుకున్నారు.కేంద్రం నుంచి స‌త్సంబంధాలు నెర‌పుతూ..ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు రాబ‌డుతూ.. రాష్ట్రాభివృద్ధిని మరింత వేగ‌వంతం చేస్తున్నారు.ఓ వైపు లోటు బ‌డ్జెట్ ఉన్నా, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచి ఆయా వ‌ర్గాల మ‌న్న‌న‌లు అందుకున్నారు. పాల‌న‌లో కాగిత ర‌హిత విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టి త‌న విజ‌నేంటో చెప్ప‌క‌నే చెప్పారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం చిన‌బాబు లోకేశ్ నేతృత్వంలో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ఆప‌ద సమ‌యంలో వారిని ఎంత‌గానో ఆదుకుంటున్నారు. కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల చ‌దువులు పూర్తైతే వారికి ప్రైవేటు సంస్థ‌ల్లో ఉద్యోగాలు క‌ల్పించేందుకు సైతం పాటుప‌డుతున్నారు. ప్ర‌తి ప‌దేళ్ల‌కూ పార్టీ ద‌శ‌నూ,దిశ‌నూ మారుస్తూ..క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేస్తూ.. జాతీయ స్థాయిలో మ‌రింత‌గా రాణించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

నాటికీ – నేటికీ అనుసంధాన క‌ర్త‌గా చంద్ర‌బాబు నిలుస్తూ.. పార్టీలో యువ‌రక్తానికి చోటిస్తూ.. త్వ‌ర‌లోనే ఇత‌ర రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు క్యాడ‌ర్ ను స‌మాయ‌త్తం చేస్తున్నారు.జాతీయ పార్టీగా దీనిని నిల‌బెట్టి తెలుగువారు ఎక్క‌డున్నా వారి సంక్షేమానికి పాటుప‌డేందుకు బాబు త‌న‌దైన వ్యూహ ర‌చ‌న గావిస్తున్నారు.ఏదైతేనేం ఓ చిన్న పాయ‌గా మొదలైన టీడీపీ ఇప్పుడొక స‌ముద్రం. ఒక‌ప్పుడు ఓ బిందువు..ఇప్పుడొక సింధువు. మారుతున్న కాలానుగుణంగా త‌న‌ను తాను మార్చుకుంటూ.. మ‌లుచుకుంటూ.. స‌రికొత్త పంధాలోదూసుకుపోతూ.. నూత‌న రాజ‌కీయానికి శ్రీ‌కారం దిద్దుతూ.. పాల‌న ఒర‌వ‌డిని మార్చుతూ.. ముందుకు దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి శత‌మానం భ‌వ‌తి.

ఈ రోజు మ‌నందరం ప‌సుపు దండులో స‌భ్యులం.. ఈవేళ మ‌నందరం చంద్ర‌బాబు సార‌థ్యంలో న‌డుస్తోన్న యోధులం. రండి! పార్టీని బ‌లోపేతం చేద్దాం. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుదాం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేద్దాం..

Leave a Reply

*