సీఎంకు చెడ్డపేరు తీసుకురాను : ఎమ్మెల్సీ సతీష్

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని, ఆయనకు చెడ్డపేరు తెచ్చేపని ఏనాడు చేయనని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ తెలిపారు. రెండురోజల కిందట సూర్యలంక సముద్రతీరంలోని హరితాబీచ్‌ రిసార్ట్స్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, సిబ్బందిపై ఎమ్మెల్సీ, అనుచరులతో కలిసి దాడిచేసి కొట్టినట్లు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై రెండురోజులుగా మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ సతీష్‌ సోమవారం బాపట్లకు రావటంతో నియోజకవర్గ పార్టీశ్రేణులు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చెరువుజమ్ములపాలెం ఆర్‌వోబీ వద్ద బహిరంగ సభ ఏర్పాటుచేశారు. సభలో ఎమ్మెల్సీ సతీష్‌ మాట్లాడుతూ టీడీపీ కోసం, ముఖ్యమంత్రి గెలుపు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని, 2019ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. గెలిచితీరుతానని వ్యాఖ్యానించారు. తనపై వచ్చే అభియోగాల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. తప్పు చేసిన అధికారులను మందలిస్తే కుట్రపన్ని తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. తనను అప్రతిష్ఠపాలు చేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని రెండు రోజులుగా మౌనంగా ఉన్నానని, తనపై చేస్తున్న ఆరోపణలుచూసి మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు.తనపై జరిగిన కుట్రను నిరసిస్తూ పార్టీశ్రేణులు సంఘీభావంగా స్వాగతం పలకడంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీశ్రేణులు, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సలగల రాజశేఖర్‌బాబు, ఏఎంసీ చైర్మన రావిపూడి నాగమల్లేశ్వరరావు, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరి శ్రీనివాసరెడ్డి, పార్టీ కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, గోకరాజు శ్రీధర్‌వర్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తోట నారాయణరావు, మాజీ ఎంపీపీ తాతా లీలావరప్రసాదరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తోట మల్లేశ్వరి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Leave a Reply

*