జైలుకెళ్లొచ్చిన వ్యక్తా వేలేత్తి చూపేది!

‘మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అవినీతిపరుడని అంటున్నారు. ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు కదా?’ అని అడుగగా.. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉందని, అలాంటప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరమేముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. అవినీతి ఊబిలో కూరుకుపోయి జైలుపాలైన వ్యక్తి కూడా తనను వేలెత్తి చూపుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు తనను నమ్మి రాజధాని నిర్మాణానికి 35వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని, ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా పట్టించుకోకుండా తనపై విశ్వాసం ఉంచారని చెప్పారు. రైతులు భూములిస్తే.. రాజధాని అభివృద్ధి సంస్థ పనులు నిర్వర్తిస్తోందని, కానీ అక్కడ రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కొంతమంది విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అక్కడ అంత డబ్బు ఎక్కడుంది? అవినీతికి ఆస్కారమెక్కడుంది?’ అని నిలదీశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురయ్యారని, రాజధానిని కోల్పోయామన్న బాధ ప్రజల్లో ఉందని చెప్పారు. అందరం కలిసి రాషా్ట్రన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ‘ఆంధ్రప్రదేశ సింగపూర్‌ కంటే 200 రెట్లు పెద్దది. సింగపూర్‌ జనాభా కంటే పది రెట్లు ఎక్కువ. ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా తపన’ అని బాబు పేర్కొన్నారు. అమరావతిని హైదరాబాద్‌ కంటే గొప్ప నగరంగా నిర్మిస్తారా అని అడుగగా.. దేశంలోకెల్లా గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధానులుగా వాజపేయి, నరేంద్ర మోదీల్లో ఎవరు గొప్పని ప్రశ్నించగా.. ‘వాజపేయి వ్యవహారశైలి వేరు. దేశాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి దేశాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు. ఇద్దరూ పరిపాలనాదక్షులే.. పోల్చలేం. ఇప్పటి పరిస్థితులను బట్టి మోదీ బాగా చేస్తున్నారు’ అని కితాబిచ్చారు.

Comments

comments

Leave a Reply

*