ఏపీలో ఫోర్స్

నవ్యాంధ్రలో కేంద్ర బలగాలు కొలువు తీరేందుకు సహకరిస్తామని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రానికి నిధులు అందిస్తామని… సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) బెటాలియన్లనూ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి సోమవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) 10వ బెటాలియన్‌ భవనాలకు సోమవారం రాజ్‌నాథ్‌ శంకుస్థాపన చేశారు. తుఫాన్లు, భూకంపాలు మొదలుకొని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా… ప్రజలు సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ వైపు చూస్తారని రాజ్‌నాథ్‌ తెలిపారు.

‘‘కేంద్ర సంస్థలు ఏది కొత్తగా స్థాపించాలన్నా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారు. భూమి కేటాయించేందుకు సిద్ధమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు అమలయ్యేలా వెంకయ్య ఒత్తిడి తెస్తారు’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. గన్నవరం సమీపంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ను కేంద్రం వెంటపడి సాధించుకున్నారని, ఈ ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్‌పీఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రేహౌండ్స్‌ ఏర్పాటుకు ఇప్పటికే ఏపీ ప్రతిపాదనలు పంపినందున విభజన చట్టం ప్రకారం పూర్తి చేస్తామని రాజ్‌నాథ్‌ చెప్పారు.

తుఫాన్లు, భూకంపాలేగాక అణు విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా ఎన్డీఆర్‌ఎ్‌ఫకు ఉందని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘1999లో సూపర్‌ సైక్లోన్‌ దెబ్బకు సుమారు 10 వేల మంది వరకూ మృతి చెందారు. 2014లో అదే తరహా తుఫాను సంభవించినప్పుడు 49 మంది మాత్రమే మరణించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తతో అందించిన సేవలే దీనికి కారణం’’ అని రాజ్‌నాథ్‌ వివరించారు. నేపాల్‌, జపాన్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలు అందించిందని… తద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.

Comments

comments

Leave a Reply

*