అమరావతి సాక్షిగా

రాజధాని అమరావతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి శ్రీలంక ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా పర్యాటక-ఆతిథ్య, గృహ నిర్మాణ రంగాల్లో భాగస్వామ్యానికి ఆ దేశ మెగాపొలిస్-పశ్చిమ ప్రావిన్స్‌ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. పలు రంగాల్లో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్‌, శ్రీలంక ప్రభుత్వాలు సుముఖత కనబరిచాయి. దీనికి సంబంధించి త్వరలో ఓ ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపుతామని శ్రీలంక ప్రభుత్వం ఆదివారం కొలంబోలో ప్రకటించింది. తమ బృందంతో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, చర్చల తర్వాత పరస్పర సహకారం-భాగస్వామ్యంపై అవగాహనకు రావాలని నిర్ణయించారు. రెండ్రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈడీబీ సీఈవో కృష్ణకిశోర్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ రామాంజనేయులు తదితరులతో కూడిన బృందం శ్రీలంక వెళ్లింది. శనివారం రాత్రి ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికి విందు ఇచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. ఆదివారం ఆయనతో కలసి కీలకమైన సదస్సులో పాల్గొన్నారు. అంతకుముందు.. చంద్రబాబు శ్రీలంకలో అభివృద్ధి పథంలో సాగుతున్న పశ్చిమ ప్రావిన్సును సందర్శించారు. మెగాపొలి్‌స-పశ్చిమ ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి పాటలి చంపిక రణవాకతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ముఖ్యమంత్రి బృందానికి విందు ఇచ్చారు. ఆదివారం వివిధ వేదికలపై చర్చకు వచ్చిన పలు అంశాలపై.. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీలంక ప్రతినిధి బృందం వచ్చినప్పుడు స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. రణవాకతో ‘పట్టణ మౌలిక సదుపాయాలు – సుస్థిర అభివృద్ధి’ అనే అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడానికి పశ్చిమ ప్రావిన్సు సిద్ధపడినట్లు తెలిపారు.

Comments

comments

Leave a Reply

*